చైనాలోని (China) హ్యాంగ్‌జౌ (Hangzhou) వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ (ISSF Shooting) ప్రపంచకప్‌లో (World Cup) భారత షూటర్లు (Indian Shooters) మరోసారి తమ ప్రతిభను చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఈషా సింగ్ (Esha Singh) అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకోగా, ఒలింపిక్ పతక విజేత మను భాకర్ (Manu Bhaker) కాంస్య పతకంతో మెరిసింది. ఈ ఈవెంట్‌లో ఇద్దరు భారత షూటర్లు ఒకేసారి పోడియంపై నిలవడం భారత షూటింగ్ చరిత్రలో మరో విశేషంగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా సింగ్ 40 హిట్స్ సాధించి అగ్రస్థానంలో నిలవగా, మను భాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ భారత షూటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. 586-20x స్కోరుతో మను భాకర్ (Manu Bhaker) అగ్రస్థానంలో నిలవగా, 585-18x స్కోరుతో ఈషా సింగ్ (Esha Singh) రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే తుది పోరులో 21 ఏళ్ల ఈషా అసాధారణ నైపుణ్యాన్ని కనబరిచి మనును వెనక్కి నెట్టి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ షూటింగ్ వేదికపై భారత మహిళా షూటర్ల ఆధిపత్యం మరోసారి రుజువైంది. భారత్‌కు మరో రెండు పతకాలు అందించిన ఈషా, మను ప్రదర్శనపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








