ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ఉద్యోగాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త అనుమానాలు, అవకతవకల ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలులో స్పోర్ట్స్ కోటా ఉద్యోగి ఈడిగ ప్రభాకర్ వ్యవహారం మొదలు గుంటూరు, విశాఖ, వైఎస్సార్ జిల్లా, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లోని అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో.. తాజాగా టెట్ అర్హత లేకుండానే తెలుగు టీచర్ ఉద్యోగం దక్కిందన్న ఆరోపణ చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా హోళగుంద మండలానికి చెందిన జంపాల ఉష అనే మహిళకు స్పోర్ట్స్ కోటాలో ఎస్‌ఏ తెలుగు ఉద్యోగం లభించింది. అయితే ఆమెకు తెలుగులో టెట్ అర్హత ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దరఖాస్తు సమయంలో ఆమె ఎస్‌ఏ బయాలజీగా పేర్కొన్నప్పటికీ.. తుది సెలక్షన్ జాబితాలో మాత్రం ఎస్‌ఏ తెలుగు పోస్టుకు ఎంపిక చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆమె సమర్పించిన సర్టిఫికెట్లలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన టెట్ వివరాలు ఉన్నప్పటికీ.. తెలుగుకు సంబంధించిన టెట్ అర్హత కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు.
జంపాల ఉష ఉపయోగించిన హాల్‌టికెట్ నంబర్‌తో తెలుగు టెట్ రాసినట్లు రికార్డుల్లో కనిపించడం లేదన్నది ప్రధాన ఆరోపణ. హోళగుంద మండలానికి సంబంధించిన టెట్ రికార్డుల్లోనూ ఆమె తెలుగు సబ్జెక్టులో పరీక్ష రాసినట్లు ఆధారం అందుబాటులో లేకపోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం అప్‌లోడ్ చేసిన ఆమె సర్టిఫికెట్లలో కూడా తెలుగు టెట్ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో అసలు ఆమెకు తెలుగు టెట్ అర్హత ఎలా వచ్చింది? ఏ నిబంధనల ప్రకారం ఎస్‌ఏ తెలుగు పోస్టుకు ఎంపిక చేశారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎస్‌కేయూ యూనివర్సిటీకి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా ఆమెకు స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగం లభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోళగుంద మండలం వందవాగిలి పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జంపాల ఉష టెట్ అర్హతపై కూడా అధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
టెట్ అర్హత లేకపోతే తెలుగు టీచర్ పోస్టు ఎలా దక్కింది? అర్హత ఉంటే ఆ వివరాలు అధికారిక రికార్డుల్లో ఎందుకు కనిపించడం లేదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపణలు వస్తున్న ప్రతి అంశంపైనా పారదర్శకంగా విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.









బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?