తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్‌కు సంబంధించిన సపోర్టు తీగ ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్తున్న జానకి (28) విద్యుత్ వైరు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేయగా.. ఆమెను రక్షించేందుకు వెళ్లిన తల్లి మంగ (55) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కుమార్తెను, తల్లిని రక్షించేందుకు ప్రయత్నించిన జానకి భర్త నాగరాజు (32) కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. చెక్కతో విద్యుత్ వైర్‌ను పక్కకు తప్పించే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోవడం, భర్త తీవ్రంగా గాయపడటంతో గొల్లవీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వర్షం నుంచి రక్షణ కోసం ఇళ్లలోనే ఉన్న సమయంలోనే విద్యుత్ ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కళ్లముందే భార్యను, అత్తను కోల్పోయిన నాగరాజు పరిస్థితి స్థానికులను కలచివేసింది. వర్షాలు కురుస్తున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు, సపోర్టు వైర్లకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ స్వయంగా విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.








