రాయలసీమకు రక్షణ కవచమే లిఫ్ట్‌ స్కీం.. చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌

రాయలసీమకు రక్షణ కవచమే లిఫ్ట్‌ స్కీం.. చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌

Summarize with AI

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీం ఆవశ్యకతను, దాని వెనుక ఉన్న సాంకేతిక అంశాలను వివరిస్తూ ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ ట్వీట్‌ చేశారు. రాయలసీమకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చేపట్టిన ఈ పథకంపై వాస్తవాలను వివరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాల కోసం మౌనంగా ఉన్నారని విమర్శించారు.

అవే నీళ్లు.. అవే కేటాయింపులు.. అవే కాల్వలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ పథకానికి అదనపు నీటి కేటాయింపులు, కొత్త కాల్వలు, అదనపు రిజర్వాయర్లు, అదనపు ఆయకట్టు లేవని వివరించారు. అదే కృష్ణానది నుంచి, అవే నీటి కేటాయింపులను, అదే పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఇప్పటికే ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. తరచూ దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనే రాయలసీమకు ఇదొక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదని పేర్కొన్నారు.

880 అడుగుల నీటిమట్టం ఉంటేనే పూర్తిస్థాయిలో నీటి తరలింపు
కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీటి పరిమాణం తగ్గిపోతోందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడం ఒక సమస్య అయితే, శ్రీశైలానికి చేరిన నీటిని తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేయడం మరో సమస్యగా మారిందన్నారు.

  • శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించగలం.
  • నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా అసలు నీటినే తరలించలేం.
  • శ్రీశైలంలో 880 అడుగులపైన నీటిమట్టం ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి.
  • ఈ పరిస్థితుల కారణంగా రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చడం కష్టతరంగా మారుతోందని జగన్‌ వివరించారు.

తెలంగాణకు 800 అడుగుల నుంచే నీటిని తరలించే సామర్థ్యం
శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటిమట్టం నుంచే నీటిని తీసుకునేలా తెలంగాణ పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా రోజువారీ నీటి తరలింపు సామర్థ్యాన్ని వివరించారు.

  • పాలమూరు–రంగారెడ్డి – 1.5 టీఎంసీలు
  • డిండి – 0.5 టీఎంసీ
  • కల్వకుర్తి – 0.4 టీఎంసీ
  • ఎస్‌ఎల్‌బీసీ – 0.5 టీఎంసీ

మొత్తంగా రోజుకు దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంతో తెలంగాణ ముందుకెళ్తోందని, దీనికితోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేస్తోందని తెలిపారు.

రాయలసీమ లిఫ్ట్‌ స్కీం ఎందుకు అవసరం?
శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోయి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని జగన్‌ వివరించారు. నీటిని ఎత్తిపోసి అదే పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు. నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుందని ప్రశ్నించారు. అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్లు, ఆయకట్టు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని నిలదీశారు.

హాట్‌లైన్‌ రాజకీయాలకు రాయలసీమ ప్రయోజనాలు బలి
దాదాపుగా పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే నిలిపివేశారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. పథకాన్ని పూర్తి చేస్తే జగన్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే పనులను ఆపేశారని పేర్కొన్నారు. ఈ పథకంపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిన చంద్రబాబు.. హాట్‌లైన్‌ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను బలిపెట్టారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువు వంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశారని చంద్రబాబుపై జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment