అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’(Vrushakarma) ట్రైలర్ విడుదలైంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad), సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని నార్త్ రాజుపాలెం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం నాగచైతన్య తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
2 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా సాగింది. ‘అతీంద్ర శక్తి తన బలిని ఎందుకుంది?’ అనే ప్రశ్నతో ప్రారంభమైన ట్రైలర్‌లో ‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవి నువ్వే’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, ఉత్కంఠభరితమైన నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న కార్తీక్ వర్మ దండు ఈసారి సరికొత్త కథాంశంతో నాగచైతన్యను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి పెరగగా, డిసెంబర్ 4న ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








