రాజ్యాంగంపై బీజేపీ కుట్రలు చేస్తోందని, వాటిని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాము పాలకులం కాదని, ప్రజాసేవకులమని పేర్కొంటూ ప్రజల హక్కులను, రాజ్యాంగ విలువలను కాపాడటం తమ బాధ్యతని అన్నారు.
బీజేపీ ఎన్నికల్లో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, పేదలు, దళితులు, గిరిజనుల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి సైమన్ కమిషన్‌తో ప్రస్తుత పరిణామాలను పోల్చారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 90 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ సీట్లు సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు.








