విజయవాడ (Vijayawada) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్లు (Voters) తీవ్ర అయోమయానికి గురయ్యారు. నగరంలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై (Ballot Papers) అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రించడం కలకలం రేపింది. వైసీపీ (YSR Congress Party Candidate) అభ్యర్థి షేక్ హుసేన్ బాషా (Sheikh Hussain Basha) పేరు పక్కన కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన హస్తం గుర్తు ముద్రించగా.. కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ (Shareef Sheikh) పేరు ఎదుట వైసీపీకి చెందిన ఫ్యాన్ గుర్తును ముద్రించారు.
దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. గతంలో రిటర్నింగ్ అధికారి (Returning Officer) విడుదల చేసిన ఫారం-11లో అభ్యర్థుల పేర్లు, గుర్తులు సక్రమంగానే ఉన్నప్పటికీ.. పోలింగ్ బ్యాలెట్ పేపర్లలో(Ballot Papers) మాత్రం గుర్తులు మారిపోయాయి.
ఈ విషయంపై వైసీపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో 55వ డివిజన్లో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్త బ్యాలెట్ పేపర్లు ముద్రించిన అనంతరం తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందుకు మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. బ్యాలెట్ పేపర్లపై గుర్తుల తారుమారుతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ ఘటనపై వైసీపీ అభ్యర్థి షేక్ హుసేన్ బాషా (Sheikh Hussain Basha) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లలో ఎన్నికల గుర్తులు తప్పుగా ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొత్త బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని కోరినట్లు తెలిపారు. పోలింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఓటింగ్ సమయాన్ని పొడిగించాలని అధికారులను కోరారు. అలాగే పోలింగ్ ముగిసిన తర్వాత బయట వ్యక్తులు కేంద్రాల్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో 55వ డివిజన్లో ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తాయి.








