విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై కూటమి నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వరుదు కళ్యాణిని మాట్లాడనివ్వకుండా కూటమి నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
మరోవైపు, నగరంలోని 37వ వార్డు పరిధిలోని 5వ పోలింగ్ బూత్ వద్ద మరింత ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జనసేన, టీడీపీ ఏజెంట్లతో పోలింగ్ సిబ్బంది కుమ్మక్కయ్యారని పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఘటనాస్థలానికి వెళ్లిన వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా సిబ్బంది అడ్డుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని కూడా కూటమి నాయకులు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న పరిణామాలను పరిశీలించేందుకు వెళ్లిన అభ్యర్థులకే అడ్డంకులు సృష్టిస్తే, సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలపై వరుదు కళ్యాణి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 37వ వార్డులో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తెలిపారు.








