సీఈసీపై ముద‌రుతున్న‌ వివాదం.. ఏక‌తాటిపైకి విపక్షాలు

సీఈసీపై ముద‌రుతున్న‌ వివాదం.. ఏక‌తాటిపైకి విపక్షాలు

Summarize with AI

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై వెలువడుతున్న వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయాల అమలులో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణ (SIR), ఓటుచోరి వ్యవహారాలు జాతీయ స్థాయిలో పెద్ద వివాదంగా మారాయి. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్నీ విభేదాలను పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వంపై, సీఈసీపై పోరాటానికి ఏకమవుతున్నాయి.

మరోవైపు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ సైతం ఎన్నికల సంఘంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

శత్రుత్వాన్ని పక్కనబెట్టిన సీపీఎం – తృణమూల్
ఈ వివాదం దేశ రాజకీయాల్లో నూతన సమీకరణాలకు దారితీస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం ఉన్న సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలు ఈసీ వ్యవహారంలో ఒకే వేదికపైకి రావడం గమనార్హం. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ విపక్షాలన్నింటికీ లేఖలు రాస్తూ సీఈసీ వైఖరిపై సంయుక్త పోరాటానికి పిలుపునిచ్చారు.

ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, స్వయంగా ఎంఏ బేబీకి ఫోన్ చేసి మాట్లాడి ఉమ్మడి పోరాటానికి మద్దతు తెలిపారు. వచ్చే వారంలోనే ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఫోన్ చేసి కోరారు.

కేవలం ‘ఇండియా’ కూటమి పార్టీలకే పరిమితం కాకుండా, కూటమిలో లేని ప్రధాన ప్రాంతీయ పార్టీలను కూడా ఈ పోరాటంలో భాగస్వాములను చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఇప్పటికే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), డీఎంకే, బిజూ జనతాదళ్ (బీజేడీ) వంటి కీలక పార్టీల నేతలకు లేఖలు రాశారు.

ఓటుచోరి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిరసనలను మరింత ఉధృతం చేస్తోంది. రాబోయే మంగళవారం నాడు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీలో ఈ వివాదంపైనే ప్రధానంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

ఎన్డీయే కూటమిలోనూ అలజడి
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం, జంతర్ మంతర్ వద్ద భద్రతను కేంద్ర బలగాలు తీవ్ర స్థాయిలో పటిష్టం చేశాయి. అటు విపక్షాల పోరాటం ఉధృతం కావడం, సీఈసీ నిర్ణయాలపై అంతర్గత విభేదాల వార్తలు రావడంతో కేంద్రంలోని ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల్లోనూ చర్చ మొదలైంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్వయంగా ఈ ఆరోపణలపై స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వసనీయత దెబ్బతింటుందని ఎన్డీయేలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

ఏదేమైనా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద రాజకీయ పరీక్షగా మారడమే కాకుండా, చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తెచ్చే ప్రధాన అంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment