ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) శాసనసభ వర్షాకాల (Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీకి (YSRCP) పట్టున్న శాసనమండలిలో చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తొలిరోజే డీఎస్సీ అంశం రాజకీయ వేడిని పెంచింది. డీఎస్సీ-2025లో అక్రమాలు(DSC-2025 Irregularities), అవకతవకలపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు (YSRCP MLCs) వాయిదా తీర్మానం ఇచ్చారు.
డీఎస్సీ-2025లో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి(Chandrashekhar Reddy), కల్పలత(Kalpalatha), రామచంద్రారెడ్డి (Ramachandra Reddy) శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ‘మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ’ (Mega DSC-Fraud DSC)అంటూ నినాదాలు చేశారు. డీఎస్సీ-2025పై తక్షణమే చర్చ చేపట్టాలని, వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యుల నినాదాలతో శాసనమండలిలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
వైసీపీ సభ్యుల నినాదాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సభ్యులను నియంత్రించాలని, సభను ఆర్డర్‌లోకి తీసుకురావాలని మండలి చైర్మన్‌ను కోరారు.
మరోవైపు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)(BAC) సమావేశంలో అసెంబ్లీ, మండలి తదుపరి కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. తొలిరోజే డీఎస్సీ అంశంపై వైసీపీ ఆందోళనకు దిగడంతో ఏపీ శాసనమండలి సమావేశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.







