ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా..? ప్రశ్నిస్తే కేసులు, పోస్టులు పెడితే జైళ్లు.. నిరసన తెలిపితే దాడులు చేయడమే కాకుండా అత్యంత నీచంగా దీక్షా శిబిరం పైనుంచి టీడీపీ(TDP) నాయకుడు మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’లో(Mega DSC) అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ(YSRCP) నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అనుచరులు దౌర్జన్యానికి దిగారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మల్లాది విష్ణు (Malladi Vishnu) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముత్యాలపాడు వద్ద శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బోండా ఉమ వర్గీయులు దీక్షా శిబిరంపై దాడులకు తెగబడ్డారు. దీక్షలో కూర్చున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై బోండా అనుచరులు తీవ్రస్థాయిలో రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు.
దీక్షా శిబిరం (Protest Camp) కోసం ఏర్పాటు చేసిన టెంట్లను బలవంతంగా లాగిపడేసి, వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు. నిరసనలో పాల్గొన్న మహిళా నాయకులు, కార్యకర్తలపై కూడా బోండా ఉమ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీక్షా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపైకి బోండా అనుచరులు దూసుకొచ్చి దాడికి యత్నించారు.
దీక్షా శిబిరం పైభాగం నుంచి ఒక టీడీపీ కార్యకర్త టాయిలెట్ పోస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటన అక్కడ మోహరించిన పోలీసు అధికారుల సమక్షంలోనే జరుగుతున్నా, వారు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.
మంత్రి లోకేష్ ఆదేశాలతోనే దాడులు
ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యారంగంలో డీఎస్సీ పేరుతో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆదేశాలతోనే ఈ దాడులకు పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. “శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేస్తుంటే ఓర్చుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. నారా లోకేష్ రాజీనామా డిమాండ్‌తో నిర్వహించిన ఈ ఆందోళనతో బెదిరిపోయిన ప్రభుత్వం, బోండా ఉమ తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేయించాడు. పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ మూగనోము వహించడం దారుణం” అని వైసీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం ఈ దాడి ఘటనతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.








