పొగాకు రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దేవరపల్లి పర్యటన పోలీసుల ఆంక్షలు, భద్రతా లోపాలు మధ్య కొనసాగుతోంది. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో నేరుగా మాట్లాడేందుకు వచ్చిన వైఎస్ జగన్‌కు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘జడ్ ప్లస్’ (Z+) కేటగిరీ భద్రతలో ఉన్న వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనకు సంబంధించి పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ సమీపంలో పోలీసు అధికారులూ కనపడకపోవడం తీవ్ర కలకలం రేపింది. హెలిప్యాడ్‌కు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు, స్థానిక రైతులు, ప్రజలు తరలివచ్చారు. భద్రతా సిబ్బంది లేకపోవడంతో హెలిప్యాడ్ వద్ద వేచి ఉన్న జనం బ్యారికేడ్లను నెట్టుకుని ఏకంగా హెలికాప్టర్ వరకు చేరుకున్నారు.
హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన అనంతరం జగన్ వాహనాన్ని చుట్టుముట్టిన జనసందోహాన్ని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ ఆరోపిస్తోంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయకపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా వైఎస్ జగన్ దాదాపు పావుగంటకు పైగా వాహనంలోనే నిలిచిపోవాల్సి వచ్చిందని పేర్కొంది.
ప్రభుత్వ వైఖరిపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్‌కు కనీస భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు వచ్చే అభిమానులపై ఆంక్షలు విధించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్‌ను చూసేందుకు మేడపై కూర్చున్న అభిమానులను కూడా కిందకు దింపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆంక్షల పేరుతో పొలాల్లోంచి పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకుంటున్న రైతులను అడ్డుకున్న పోలీసులు, జగన్ భద్రత విషయంలో మాత్రం తీవ్ర అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.








