కావేరీ నదీ జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని కావేరీ నది తీరంలో రైతులు ఇసుకలో తమను తాము పాతిపెట్టుకుని ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. రైతు సంఘం నాయకుడు అయ్యకన్ను నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో, సాగునీటి కోసం తమిళనాడుకు రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం తగినంత నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించిన రైతులు, తమ పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.
ఈ సందర్భంగా అయ్యకన్ను కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు న్యాయంగా రావాల్సిన నీటిని ఇవ్వకుండా, మిగిలిన నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక నుంచి రూ.1 లక్ష కోట్ల పరిహారం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. అలాగే కావేరీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కర్ణాటక చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌పై కూడా రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది పూర్తయితే తమిళనాడుకు అందే కావేరీ నీరు మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు కావేరీ నీటి అంశంపై తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ కూడా లక్ష్యంగా చేసుకుంది. డెల్టా ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి. సెల్వం విమర్శించారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు నీరు వచ్చేలా ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ జల వివాదం ప్రతి ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మళ్లీ తెరపైకి వస్తుండగా, తాజాగా రైతులు చేపట్టిన ఈ వినూత్న నిరసనతో మరోసారి ఈ సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సాగునీటి కోసం తమ హక్కు మేరకు నీటిని అందించాలని రైతులు ప్రభుత్వాలను మరోసారి కోరుతున్నారు.








