హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ట్యాంక్ బండ్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సమితి ప్రతినిధులు ట్యాంక్ బండ్‌పై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్ పైనే నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి కూడా అక్కడ నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదని విమర్శించారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్‌తో పాటు అరెస్ట్ చేసిన ప్రతినిధులందరినీ ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉండగా.. నగరంలో వినాయక చవితి ఉత్సవాల వేళ హుస్సేన్‌సాగర్ (ట్యాంక్ బండ్) పరిసరాల్లో నిమజ్జనాలపై విధించిన ఆంక్షలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సరస్సు కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ట్యాంక్ బండ్‌పై భారీ విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం భాగ్యనగరంలో గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రభుత్వం మధ్య పెద్ద ఎత్తున చర్చకు, నిరసనలకు వేదికగా మారింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సరస్సును రక్షించేందుకు నగరం నలుమూలలా కృత్రిమ నిమజ్జన కొలనులను ఏర్పాటు చేశారు. చిన్న, మీడియం విగ్రహాలను మాత్రమే వీటిలో నిమజ్జనం చేయాలని, ట్యాంక్ బండ్ వైపు వాహనాలను అనుమతించబోమని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.







