దానం నాగేందర్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్‌ను విచారించాలని నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా, హై కోర్టు విచారించి అనర్హతా వేటు వేసిందని వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అందువల్ల అత్యవసరంగా విచారించాలని కోరారు. బుధవారం నాడు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్టీ ఫిరాయించారన్న కారణంతో తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే తనకు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలేదని తొలుత చెప్పిన దానం.. శనివారం మధ్యాహ్నం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదిగా బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(ఎ) రెడ్ విత్ ఆర్టికల్ 191(2)కింద తనను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యే అనర్హత విషయంలో స్పీకర్ తీసుకొనే నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించడానికి వీల్లేదన్నది పిటిషన్‌లో పేర్కొన్నారు.








