ఏపీ (Andhra Pradesh) కంటే ఒడిశానే (Odisha) బెటర్ అని ఓ భారీ పరిశ్రమ భావిస్తుందా..? ఏపీ నుంచి రూ.6,675 కోట్ల పెట్టుబడి పొరుగు రాష్ట్రానికి తరలిపోతుందా..? అంటే అవునని అంటున్నాయి జాతీయ మీడియా కథనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరదపారుతోందని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి (Chandrababu Government) బిగ్‌షాక్ తగిలింది. నెల్లూరులో(Nellore) ఏర్పాటు కావాల్సిన రూ. 6,675 కోట్ల విలువైన భారీ ఇంగాట్-వేఫర్ (Ingot-Wafer) ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తరలిపోవడం తీవ్ర రాజకీయ కలకలం రేపుతోంది. పరిశ్రమల సాధనలో కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పురోగతి లేదంటూ ప్రతిపక్ష వైసీపీ(YSRCP) నిప్పులు చెరుగుతోంది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక (The Economic Times Report) ప్రకారం.. 10 గిగావాట్ల (10 GW) సామర్థ్యంతో నెల్లూరులో నిర్మించాలనుకున్న సొలార్ ఇంగాట్-వేఫర్ (Solar Ingot-Wafer) మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను (Manufacturing Plant) ఏపీ కంటే ఒడిశాలోనే ఏర్పాటు చేయడం మేలని టాటా పవర్ నిర్ణయించింది. తక్కువ విద్యుత్ ధరలు, మెరుగైన ఇన్సెంటివ్‌లు, గోపాల్‌పూర్ ఎస్‌ఈజెడ్‌లో (SEZ) సిద్ధంగా ఉన్న భూమి లభ్యత వల్ల ఒడిశా వైపే మొగ్గు చూపినట్లు టాటా పవర్ (Tata Power) మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. రూ. 6,675 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరులో రావలసిన ఈ మెగా ప్రాజెక్ట్ చేజారడంతో వేలాది మంది స్థానిక యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రెండేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలపై వైసీపీ ఎంపీ(YSRCP MP) ప్రశ్నకు కేంద్ర మంత్రి కుండబద్ధలు కొట్టినట్టుగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలని చెబుతున్నప్పటికీ.. గత రెండేళ్లలో ఏపీలో డీపీఐఐటీ(DPIIT), ఇన్వెస్ట్ ఇండియా (Invest India) పర్యవేక్షించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో కేవలం పది ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, అందులో రెండు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లోక్‌సభకు తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.
లోకేష్ ప్రచార ఆర్భాటంపై సెటైర్లు
పరిశ్రమలు తెస్తున్నామంటూ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రతిరోజూ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రకటనలు, హోర్డింగ్‌ల ద్వారా భారీగా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే ఏం చేస్తున్నారంటూ వైసీపీ(YSRCP) ప్రశ్నిస్తోంది. 6 నెలలు కూడా తిరగకముందే నెల్లూరు నుంచి భారీ పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోతుంటే లోకేష్ ఏం సమాధానం చెబుతారు? అని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ ప్రతిరోజూ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు తమ హయాంలో తరలిపోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఎలాంటి కట్టుకథలు అల్లుతారని ప్రతిపక్షం నిలదీస్తోంది. ఇటీవలే ఏపీ ర్యాంకింగ్స్(AP Rankings) తగ్గాయని వచ్చిన వార్తలు, దాంతో పాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business)’ కంటే పక్క రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే నచ్చి కంపెనీలు వెళ్లిపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్లు పక్కనపెట్టి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను కాపాడుకోవడంలో దృష్టి సారించాలని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.









