ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాకప్‌డెట్‌లు, కస్టోడియల్ చిత్రహింసల వ్యవహారాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. సాయికృష్ణ ఉదంతం నుంచి బయటకొస్తున్న కస్టోడియల్ డెత్‌ల పరంపర నిత్యం ఏదో ఒక జిల్లా నుంచి వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాయి. ఈ ఆరోపణలు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. రాజకీయంగానూ, సామాజికంగా లాకప్‌డెత్‌ల అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా కర్నూలు జిల్లా కౌతాళం మండలం బద్దెనహల్ (బదినేహాల్) గ్రామానికి చెందిన దళిత మహిళ మాల గంగమ్మ అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు వైసీపీ తరఫున ఒక నిజనిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీ మధుసూదన్, వైసీపీ లీగల్ సెల్, ఎస్సీ నేతలతో కూడిన కమిటీ బద్దెనహల్ గ్రామాన్ని సందర్శించింది.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కమిటీ నేతలకు, గంగమ్మ అత్తగారు మినహా మిగిలిన కుటుంబ సభ్యుల ఇళ్లకు తాళాలు వేసి ఉండటం కనిపించడంపై నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామంలో బహిరంగంగా మాట్లాడేందుకు కూడా కొందరు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోందని కమిటీ తెలిపింది. ఒక కుటుంబం మొత్తం ఛిద్రమైంది. తల్లి మరణించింది. కుమారుడి ఆచూకీపై ప్రశ్నలు.. ఇంతటి ఘటన చుట్టూ అనుమానాలు కొనసాగడం సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడింది..
“ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉంది. కొడుకు కనిపించడం లేదని పోలీసులను, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన తల్లిని.. సిట్ విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారనే ఆరోపణలు తీవ్రమైనవి” అని వైసీపీ నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కమిటీ లేవనెత్తిన ప్రధానాంశాలు
- గ్రామంలో ఉదయం వరకు ఉన్న కుటుంబ సభ్యులు కమిటీ వచ్చే సమయానికి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడం వెనుక బెదిరింపులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరగాలి.
- అదృశ్యమైన కుమారుడి ఆచూకీ కోసం కోర్టుకు వెళ్లిన గంగమ్మను, సిట్ విచారణ పేరుతో వేధించారనే ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక బయటకు రావాలి.
- బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో పెరుగుతున్న లాకప్‌డెత్‌లు
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో వరుసగా వినిపిస్తున్న పోలీస్ కస్టోడియల్ మరణాల ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై పౌరహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గంగమ్మ అనుమానాస్పద మృతి వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, గంగమ్మ పోస్టుమార్టం నివేదికలతో పాటు కేసు పూర్తి దర్యాప్తు వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.








