ఢిల్లీలో (Delhi) విద్యార్థుల నిరసనల (Students Protests) సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీచార్జ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అరెస్టులకు(Arrest) నిరసనగా తెలంగాణవ్యాప్తంగా (Across Telangana) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఫ్లెక్సీలను దహనం చేశారు. నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయగా, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావుపల్లి చౌరస్తాలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైంసాలో కూడా కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన శాంతియుత నిరసనలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పాల్గొని విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణిచివేయడం సరికాదని, గాంధేయ మార్గంలో పోరాడిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలుపుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.








