విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. కన్సల్టెన్సీ దంపతుల అరెస్ట్!

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. కన్సల్టెన్సీ దంపతుల అరెస్ట్!

Summarize with AI

విదేశాల్లో ఐటీ, ఇతర విభాగాల్లో నెలకు లక్షల్లో జీతాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులను నమ్మించి, రూ.కోట్లలో ముంచిన ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ నిర్వాహకుల గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు. దాదాపు 750 మంది బాధితుల నుంచి రూ.11.46 కోట్ల మేర వసూలు చేసి పరారీలో ఉన్న దంపతులు సౌజన్య, శ్రీనివాస్‌లను విజ‌య‌వాడ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఉద్యోగాల పేరుతో 750 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ. 11.46 కోట్లు వ‌సూలు చేశార‌ని ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు సౌజన్య, శ్రీనివాస్ దంపతులపై విజయవాడలోని మాచవరం, సైబర్ క్రైమ్, సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు న‌మోద‌య్యాయి. కొంత‌కాలంగా పరారీలో ఉన్న వీరిని ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు స‌మాచారం.

నిరుద్యోగుల నుంచి వ‌సూలు చేసిన డ‌బ్బుతో కంకిపాడు ప్రాంతంలో రూ. 1.42 కోట్ల విలువైన భూముల కొనుగోలు చేసిన‌ట్టుగా గుర్తించారు. నిందితులకు చెందిన మరిన్ని ఆస్తుల వివరాల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

హైదరాబాద్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్న విజయవాడ ప్రత్యేక పోలీస్ బృందం, వారి కన్సల్టెన్సీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. అక్కడ లభించిన ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఉద్యోగాల నెట్‌వర్క్‌పై పోలీసుల దర్యాప్తు కొన‌సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment