‘మై డియ‌ర్ చార్లెస్ శోభ‌రాజ్‌’.. టీడీపీ ఎంపీకి కేశినేని కౌంట‌ర్‌

'మై డియ‌ర్ చార్లెస్ శోభ‌రాజ్‌'.. టీడీపీ ఎంపీకి కేశినేని కౌంట‌ర్‌

బెజవాడ రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. చిన్నిని “పిట్టల దొర, చార్లెస్ శోభరాజ్” అంటూ సెటైరిక‌ల్ పేర్ల‌తో విమర్శిస్తూ నాని ఒక పోస్ట్ పెట్టారు.

“నాన్నా పిట్టల దొరా.. ప్రెస్ మీట్ పెట్టి పిట్ట కథలు బాగా చెప్పావు. అది నీకు వెన్నతో పెట్టిన విద్య అనుకో” అంటూ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం, బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బుతో పాటు తను ఎలాంటి లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడో, ఎంత విలాసవంతంగా, సంతోషంగా ఉంటున్నాడో కూడా చిన్ని బాగానే చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడ ఓటర్లు తనను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నారనే విషయాన్ని చిన్ని మర్చిపోయారని నాని విమర్శించారు. చిన్నికి ‘MP’ అంటే ‘మట్టి-పేకాట’ గోల మాత్రమే గుర్తున్నట్టు ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఢిల్లీలో పేకాట బదులు.. నాపై ఫిర్యాదు చెయ్
ఢిల్లీలో కూర్చుని పేకాడుకునే బదులు.. తనపై ప్రధానమంత్రికి, హోం మంత్రికి లేదా ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేయాలని కేశినేని నాని సవాల్ విసిరారు. “ఒకవేళ వారు నిన్ను దగ్గరకు రానీయకపోతే, కనీసం పార్లమెంట్ లోనైనా నా మీద మాట్లాడి నీ ఆక్రోశం వెళ్లగక్కవచ్చు కదా” అని టీడీపీ ఎంపీని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే ఢిల్లీలోని సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసి తక్షణమే తన్ను జైల్లో పెట్టించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. “నా ఆస్తులను జప్తు చేయించి, వాటిని వేలం వేసి ప్రజలకు పంచిపెట్టవచ్చు కదా.. ఆ పని ఎందుకు చేయట్లేదు?” అని నిలదీశారు.

ఇలాంటి చేతకాని పనులు చేయకుండా, ఇక్కడ గల్లీలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం.. నీ ‘ప్యాకేజ్ మీడియా’ లో నాపై తప్పుడు కథనాలు రాయించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాని స్పష్టం చేశారు. ఈ అబద్ధాలను నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, “మై డియర్ చార్లెస్ శోభరాజ్” అంటూ కేశినేని నాని తన పోస్ట్‌లో ఎంపీ చిన్నిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment