శివ స్వాముల‌పై లాఠీచార్జ్‌.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన

శివ స్వాముల‌పై లాఠీచార్జ్‌.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావ‌త్ హిందూ బంధువుల‌ను షాక్‌కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పి, భక్తులపై పోలీసుల లాఠీచార్జ్‌కు దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అమానుష ఘటన చోటు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

41 రోజుల క‌ఠినమైన‌ శివ దీక్షను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూర్తిచేసుకొని, ఇరుముడి క‌ట్టి శ్రీ‌శైలం కొండ‌పైకి వ‌చ్చిన స్వాముల‌ను లాఠీల‌తో కొట్ట‌డంపై హిందూ బంధువులు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేవాల‌యాల్లో బ్ర‌హ్మోత్స‌వాల నిర్వాహ‌ణ నిర్వ‌హించే ప‌ద్ధ‌తి ఇదేనా..? అని ప్ర‌శ్నిస్తున్నారు.

క్యూ లైన్లలో భక్తుల ఆర్తనాదాలు
ఉదయం నుంచే దర్శనం కోసం క్యూ లైన్లలో నిలిచిన వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తూ, చివరకు దర్శనం దక్కకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. “గేట్లు తెరవండి.. దర్శనం వద్దు.. ఇంటికి వెళ్తాం” అంటూ నిస్సహాయ స్థితిలో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో శివభక్తుల ఆర్తనాదాలు మారుమోగాయి.

శివస్వాములపై లాఠీదెబ్బలు
ఆలయ సిబ్బంది నిర్వహణ లోపాల కారణంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. భక్తులను శాంతింపజేయాల్సిన పోలీసులు సహనం కోల్పోయి, శివస్వాములు సహా భక్తులపై లాఠీలతో దాడి చేశారు. దాడి చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దర్శనానికి వచ్చిన శివభక్తులపై లాఠీచార్జ్ చేయడం మహాపచారమని హిందూ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

“ఇదేనా ఆలయాల ప్రక్షాళన?”
ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. “ఇదేనా చంద్రబాబు చెప్పే ఆలయాల ప్రక్షాళన?” అంటూ ప్రశ్నించింది. నిర్వహణ లోపం అధికారులదైతే, దెబ్బలు మాత్రం భక్తులకా? అని మండిపడింది. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివస్వాములను, సామాన్య భక్తులను పోలీసులతో కొట్టిస్తున్నారంటూ వైసీపీ ఆరోపించింది. దర్శనం కల్పించకపోవడం, లాఠీచార్జ్ ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “సీఎం డౌన్ డౌన్”, “డీసీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడున్నాడంటూ చురకలు అంటించారు. అధికారులు వీఐపీల సేవలోనే మునిగిపోయారని, సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

పాలనా వైఫల్యానికి నిదర్శనమా?
పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తులపై లాఠీచార్జ్ జరగడం చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. శివయ్య దర్శనం కోసం వచ్చిన భక్తులకు నరకాన్ని చూపించిన ఈ ఘటనపై ప్రభుత్వం, దేవస్థాన అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment