తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ విచారణ, నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయం సీఎం చంద్రబాబు ప్రకటించిన ఏకసభ్య కమిటీ ఏర్పాటుతో మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమిలోని బీజేపీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రులు కలిసి సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించిన అన్ని నివేదికలను ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని తెలిపారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక సూచించిందని, తప్పు చేసిన ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. లడ్డూ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
దేవుడితోనూ రాజకీయమా?
వైసీపీ నేతలు తనతోనే కాకుండా దేవుడితో కూడా పెట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను అప్పుడున్న రిపోర్ట్ ప్రకారంగానే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పానని వివరించారు. లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపి దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ అంశం సీబీఐ చార్జిషీట్‌లో కూడా ఉందని అన్నారు. ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు, నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామిపై చేసిన దాడిగా అభివర్ణించారు.
తప్పు చేసినవారికి క్షమాపణ తప్పదు
ఈ వ్యవహారంలో పాల్పడ్డ వారు మహా పాపం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినవారికి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కాలమే చూపిస్తుందన్నారు. దేవుడి పవిత్రతను కాపాడలేనంత అసమర్థులం కాదని స్పష్టం చేసిన చంద్రబాబు, తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేవుడి పవిత్రతను దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు.








