టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో స్పందించిన సూర్య, భారత్‌కు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఐసీసీ ఫిక్చర్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్‌తో ఆడేందుకు వెనకాడలేదని ఆయన తెలిపారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ, “మా మైండ్‌సెట్ చాలా క్లియర్. ఐసీసీ షెడ్యూల్ ఇచ్చింది, ప్రభుత్వాలు న్యూట్రల్ వేదికను నిర్ణయించాయి. కొలంబోకి మా ఫ్లైట్ కూడా బుక్ అయింది. మ్యాచ్ కోసం మేము వెళ్తాం” అని అన్నారు.
ఇక పాక్ ప్రభుత్వం రాజకీయ కారణాలతో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడంతో ఈ వ్యవహారం మరింత హీట్ పెంచుకుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్–పాక్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ ముందే నిర్ణయించగా, పాక్ వెనక్కి తగ్గితే రెండు పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. బ్యాన్, విదేశీ ఆటగాళ్లపై ఆంక్షలు వంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. టోర్నీ ప్రారంభానికి ముందే ఈ వివాదం చెలరేగడంతో, టీ20 వరల్డ్ కప్ 2026పై ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పీక్స్‌కు చేరింది.








