రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు

రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో అత్యంత భావోద్వేగాలు, వివాదాలు, పోరాటాలతో ముడిపడిన పేరు వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga). కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఈ నేత హత్యకు నేటితో (డిసెంబర్ 26) 37 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రంగా అభిమానులు, సంఘాలు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాయి. విశాఖపట్నంలో రంగనాడు బహిరంగ సభ, రాధా–రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంతో వంగవీటి రంగా హత్య (Vangaveeti Ranga Murder) అంశం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్, అలాగే కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గ‌తంలో రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలు, రంగా త‌న‌యుడు వైసీపీలో ఉండ‌గా త‌న తండ్రికి కార‌ణం టీడీపీ అని చేసిన కామెంట్స్‌ తీవ్ర రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి.

అంబటి రాంబాబు సంచలన ట్వీట్
గుంటూరులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్ (X) ఖాతా ద్వారా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. “దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గూండాలు హతమార్చి నేటికి 37 సంవత్సరాలు… జోహార్ వంగవీటి మోహన రంగా!” అంటూ చేసిన ట్వీట్ అధికార తెలుగుదేశం పార్టీపై చ‌ర్చ‌కు దారి తీసింది. ఈ వ్యాఖ్యలతో రంగా హత్య వెనుక టీడీపీ (TDP)లోని రాజకీయ శక్తుల పాత్రపై మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది.

హరిరామ జోగయ్య పుస్తకంలోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఇదే సమయంలో కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రచించిన “నా రాజకీయ ప్రస్థానం” పుస్తకంలో ఉన్న వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వంగవీటి రంగా హత్యకు సంబంధించిన అధ్యాయం ప్రస్తుతం తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

పుస్తకంలోని 71, 72, 73 పేజీల్లో ‘కాపునాడు కలతలు’ శీర్షిక కింద రంగా హత్యపై సంచలన విషయాలను జోగయ్య ప్రస్తావించారు. వంగవీటి రంగా హత్య వెనుక అప్పటి రాజకీయ నేతల ప్రమేయం ఉందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే దండు శివరామరాజు ఈ విషయాన్ని తనకు ముందే చెప్పారని జోగయ్య పుస్త‌కంలో పేర్కొన్నారు. వంగవీటిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్నినప్పుడు ఎన్టీఆర్(NTR) వ్యతిరేకించినా, చంద్రబాబు, ఉపేంద్రలు హత్యకు కుట్ర పన్నారని పుస్తకంలో రాసుకున్నారు జోగ‌య్య‌.

రాజకీయ వేడి పెరిగిన రంగా వర్ధంతి
మొత్తంగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన ట్వీట్, హరిరామ జోగయ్య పుస్తకంలోని ఆరోపణలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రంగా హత్య వెనుక నిజాలు ఏమిటి? అప్పటి రాజకీయ కుట్రలు ఎంతవరకు నిజం? అన్న ప్రశ్నలు మళ్లీ ప్రజల ముందు నిలుస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment