తెలంగాణలో(Telangana) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(Rains) ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం (Godavari Water Level) 48.5 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే చివరిదైన మూడో ప్రమాద హెచ్చరికను (Danger Warning) జారీ చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దిగువ ప్రాంతాలకు సుమారు 11.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
వరద ఉధృతి దృష్ట్యా గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. ప్రమాదం సంభవించే అవకాశమున్న ప్రాంతాల ప్రజలు వెంటనే అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా, చర్ల ప్రాంతంలో వరద బాధితులను రక్షించేందుకు వెళ్లిన సీఐ రాజువర్మకు (CI Raju Varma) తృటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆయన సమయస్ఫూర్తితో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
అలాగే, వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలు, వంతెనలు, వాగులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.










