కర్నూలు (Kurnool) బస్సు దగ్దం (Bus Burning) ఘటనలో వైసీపీ (YSRCP)పై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏకంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికే వెళ్లారు. కర్నూలు పోలీసులు వైసీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి (Pudi Srihari)కి నోటీసులు జారీ చేశారు. బస్సు దగ్దానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో 27 మందిపై కేసులు నమోదు కాగా, తాజాగా గతంలో సీఎం చీఫ్ పీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని కూడా నిందితుల జాబితాలో చేర్చడం గమనార్హం.
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి బైకర్ శివశంకర్, ఎర్రిస్వామి మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. వారు మద్యం కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు రావడంతో, ప్రమాదానికి మద్యం కారణమని ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారం వెనుక వైసీపీ ఉందని పేర్కొంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. పార్టీ నేతలు ఇది ప్రభుత్వ దమనకాండగా వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ “కర్నూలు బస్సు దగ్దానికి మద్యం కారణమని అందరికీ తెలుసు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానం. ఇప్పుడు మా పార్టీ కార్యాలయానికే పోలీసులు రావడం, ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి చర్యలకు వైసీపీ భయపడదు” అని స్పష్టం చేశారు.








