నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వైసీపీ తన మద్దతును పునరుద్ఘాటించింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. గతంలోనూ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన వైసీపీ.. ఇప్పుడు కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే నిష్పత్తిలో లోక్‌సభ స్థానాలను పెంచే ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం జరగదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షాను వైసీపీ కోరింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం జరగకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నది వైసీపీ డిమాండ్.
దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం జరగకుండా చూడాలన్న ప్రాంతీయ పార్టీల డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం తాజా ప్రతిపాదనలు రూపొందించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా సరైనవి కావని అన్నారు.
డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటులో ప్రాంతీయ పార్టీల పాత్ర మరింత కీలకంగా మారింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతుల్యతకు సంబంధించి వైసీపీ చేసిన ప్రతిపాదనకు అమిత్ షా అంగీకారం తెలిపారా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.








