నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. నంద్యాల సభలో ఆదోని శివాలయంలో యువకుడు దీపంలో సిగరెట్ వెలిగించుకున్న ఘటనను నిన్న జరిగినట్టుగా ప్రస్తావించిన సీఎం, దాన్ని వైసీపీకి ఆపాదిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అయితే, ఈ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని వైసీపీ పేర్కొంది. దీనిపై వైసీపీ ఒక ఫ్యాక్ట్‌చెక్‌ను రూపొందించింది. ఈ ఘటన 2022లో కర్నూలు జిల్లా ఆదోని శివారు రణమండల ఆంజనేయస్వామి కొండపై ఉన్న శ్రీ మునీశ్వరాలయంలో జరిగిందని తెలిపింది. విరుపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న అనే యువకుడిని అప్పట్లో నిందితుడిగా గుర్తించారని, పదో తరగతి పరీక్షల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ వీడియో తీశానని అతడు చెప్పినట్లు పేర్కొంది.
అలాగే, ఆ యువకుడు జనసేన పార్టీ అభిమాని అని, ఈ విషయాన్ని విస్మరించి ఘటనను వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. వాస్తవానికి అప్పట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే ఆ దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు, దెయ్యం లేదు అనే వ్యక్తి అని వ్యాఖ్యానించారని, పవన్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయని గుర్తుచేసింది.
చంద్రబాబు హయాంలో ఆలయాల్లో పలు ఘటనలను కూడా ఉదాహరణగా ప్రస్తావించింది. తిరుమలలో కోడిగుడ్లు, మద్యం బాటిళ్లు లభించిన ఘటనలు, గోవుల మరణాలు, గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి ఓ వ్యక్తి ఎక్కిన ఘటన, రామతీర్థం కేసు తదితర సంఘటనలను గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీ.
#YSRCPFactCheck https://t.co/h30ZRzTeS1
— YSR Congress Party (@YSRCParty) July 9, 2026







