2026 ఫిఫా ప్రపంచకప్ తుది దశకు చేరుకోవడంతో టైటిల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. 48 జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం ఎనిమిది జట్లు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా, ప్రతి మ్యాచ్ ఇప్పుడు ‘డూ ఆర్ డై’గా మారింది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా వంటి అగ్రశ్రేణి జట్లు బరిలోకి దిగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత అభిమానులకు శుభవార్త అందింది. ఇక క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీ ఫైనల్స్, ఫైనల్ వరకు జరిగే అన్ని మ్యాచ్‌లను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు.
ఇప్పటివరకు గ్రూప్ దశ మ్యాచ్‌లను సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా వీక్షించిన అభిమానులు, ఇకపై దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. క్వార్టర్ ఫైనల్స్‌లో జూలై 10న ఫ్రాన్స్-మొరాకో, జూలై 11న స్పెయిన్-బెల్జియం, జూలై 12న నార్వే-ఇంగ్లాండ్, అదే రోజు అర్జెంటీనా-స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి. టైటిల్ కోసం హోరాహోరీగా జరిగే ఈ మ్యాచ్‌లు అభిమానులకు అసలైన ఫుట్‌బాల్ థ్రిల్‌ను అందించనున్నాయి.







