ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ పనితీరుపై రైతులు, భూ యజమానుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూ రికార్డుల్లో తప్పులు, మ్యుటేషన్ల జాప్యం, సర్వేలు నిలిచిపోవడం, 22-ఏ నిషేధిత జాబితా, ఆన్‌లైన్ రికార్డుల లోపాలు వంటి సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల్లో 70-80 శాతం వరకు రెవెన్యూ సమస్యలే ఉండటం పరిస్థితిని ప్రతిబింబిస్తోందని చెబుతున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే, భూ సంస్కరణలను ఎన్నికల సమయంలో విమర్శించిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం అదే రీ సర్వేను కొనసాగిస్తూ ఏడాదిలోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం రాజకీయ చర్చకు దారితీసింది.
పట్టాదారు పాసుపుస్తకాల్లో పేర్లు, సర్వే నంబర్లు, భూ వివరాల్లో తప్పులు నమోదవుతున్నాయని, చలానాలు చెల్లించినా సర్వేలు జరగడం లేదని, కోర్టు ఆదేశాలు వచ్చినా అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పేర్లతో ఆన్‌లైన్ రికార్డులు, పట్టా భూములను 22-ఏ జాబితాలో చేర్చడం, ఆక్రమణలపై చర్యలు లేకపోవడం, భూ కొలతల్లో తప్పులు వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని చెబుతున్నారు.
గత ప్రభుత్వం 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిలో కొన్నింటిని మళ్లీ 22-ఏ జాబితాలో చేర్చిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రుణాలు, క్రయవిక్రయాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
2025 జనవరిలో ప్రభుత్వం గ్రామసభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించినా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు చెబుతున్నారు. రికార్డుల్లో పరిష్కారమైనట్లు చూపించినా, బాధితులు మళ్లీ అదే సమస్యలతో పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయిస్తున్నారని పేర్కొంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఆత్కూరు గ్రామంలో రీ సర్వే తర్వాత మూడేళ్లుగా ఎల్‌పీఎం నంబర్లు జారీ కాలేదని, మరణించిన వ్యక్తుల పేర్లు, సంబంధం లేని వారి పేర్లు రికార్డుల్లో ఉండటం, ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదు కావడం, సుమారు 600 ఖాతాల్లో 580కిపైగా రికార్డులు తప్పులతో ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రీ సర్వే అనంతరం మ్యుటేషన్లు నిలిచిపోవడం, వారసులకు భూముల బదిలీలు జరగకపోవడం, చుక్కల భూములు, జాయింట్ ఎల్‌పీఎంల తొలగింపులో జాప్యం కొనసాగుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రక్రియల్లో అవినీతి, లంచాల ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అలాగే, గతంలో వెబ్‌ల్యాండ్ నమోదుల్లో జరిగిన లోపాల వల్ల 1954కు ముందు ఉన్న అసైన్డ్ భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయని, వాటిని తొలగించుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మరి ఇంతలా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.








