నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమక్షంలోనే మంత్రి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటూ, వెంటనే మార్పు తీసుకురావాలని హెచ్చరించారు.
ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న 43 సేవల్లో 25 సేవల అమలులో మంత్రి వెనుకబడి ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇకపై పనితీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
“ప్రజలు ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారు. ప్రతి శాఖ సమర్థంగా పనిచేయాలి. పనితీరు మార్చుకోకపోతే ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది” అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి సీఎం సూచించారు. అంతేకాకుండా, సభా వేదిక నుంచే జిల్లా అధికారులను కూడా చంద్రబాబు హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సీఎం సీరియస్ అయిన అంశంపై మరోవైపున సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సీఎం సీరియస్ కావడం ఇది ఎన్నోసారి అని ఎద్దేవా చేస్తున్నారు. సీఎం సీరియస్ అంటూ ప్రకటనలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా సర్క్యులేట్ చేయడం పరిపాటిగా మారిపోయిందంటున్నారు.







