జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ, హార్బర్ భూములను ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
‘వచ్చేది మా ప్రభుత్వమే..’
జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసి, ఆ ప్రాంతాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే కుట్ర జరుగుతోందని జగన్ ఆరోపించారు. “చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. కళ్లు మూసి తెరిచేలోపే ఈ మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమే. మేము అధికారంలోకి రాగానే ఈ ప్రైవేట్ కంపెనీని ఇక్కడి నుంచి తరిమివేస్తాం. జువ్వలదిన్నెతో పాటు రాష్ట్రంలోని 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఆ హక్కును చంద్రబాబు తాత కూడా లాక్కోలేడు” అని జగన్ స్పష్టం చేశారు.
మత్స్యకారుల కడుపు కొడుతారా..?
గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని జగన్ గుర్తు చేశారు. స్థానిక మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లను పోలీసులు సీజ్ చేస్తే, వాటిని అక్రమంగా ఎత్తుకెళ్లిపోయారని మండిపడ్డారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెకు వచ్చి వెళ్లిన తర్వాతే ఈ బోట్ల మాయం జరిగిందని, ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మత్స్యకారుల పొట్ట కొట్టేందుకు ఏకమయ్యారని, సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారని ధ్వజమెత్తారు.
ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు?
ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇవ్వాలనుకుంటే పక్కనే ఉన్న కృష్ణపట్నం పోర్టు భూములు ఇవ్వాలని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తూ జువ్వలదిన్నెను ఎందుకు ఎంచుకున్నారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఏనాడూ మత్స్యకారుల బాగు గురించి ఆలోచించలేదని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని విమర్శించారు. మత్స్యకారుల హక్కుల కోసం వైసీపీ అండగా ఉంటుందని, ఏ ఒక్క హార్బర్‌ను ప్రైవేట్ పరం కానివ్వబోమని జగన్ భరోసా ఇచ్చారు.








