విశాఖ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో ఒక యువతి మృతి తీవ్ర కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన చోట స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం, ఆపై జరిగిన దాడి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
అసలేం జరిగింది?
పోలీసుల సమాచారం ప్రకారం.. వాసుపల్లి సాయికిరణ్, జి. యశ్వంత్, రంప లక్ష్మీ సౌజన్య, నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణి, శాంతికుమారి (27) అనే స్నేహితులు విశాలాక్షినగర్‌లోని బి-స్క్వేర్ లాడ్జిలో 118, 119 నెంబరు గదులను అద్దెకు తీసుకున్నారు. రాత్రి అందరూ కలిసి మద్యం సేవించారు.
ఆ సమయంలో సాయికిరణ్, శాంతికుమారి మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాంతికుమారి తన గురించి బయట తప్పుడు ప్రచారం చేస్తోందని సాయికిరణ్ నిలదీశాడు. ఆమె దానిని ఖండించినప్పటికీ, ఆగ్రహం ఆపుకోలేక సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి ఆమెపై విపరీతంగా దాడి చేశారు. దీంతో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి.
అవమానంతో తనువు చాలించిన శాంతికుమారి
కన్నవారికంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులే తనపై దాడి చేయడాన్ని శాంతికుమారి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, పక్కనే ఉన్న 118వ నెంబరు గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తలుపులు పగులగొట్టి చూడగా, శాంతికుమారి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కుటుంబ సభ్యుల రోదన
“అరగంటలో వచ్చేస్తాను” అని చెప్పి వెళ్లిన కూతురు విగతజీవిగా మారడంతో తల్లి ఆకుమర్తి రమ్య కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితులు ముందుగా తమకు ఫోన్ చేసి.. శాంతికుమారికి ఫిట్స్ వచ్చి పడిపోయిందని, అందుకే గదిలోకి పంపించామని అబద్ధాలు చెప్పారని ఆమె ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన ఈ గొడవ, ఒక యువతి ప్రాణం తీయడమే కాకుండా పలువురు యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది.








