జ‌గ‌న్ మేలు గుర్తించిన ప్రపంచ బ్యాంక్

జ‌గ‌న్ మేలు గుర్తించిన ప్రపంచ బ్యాంక్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థ గాడిలో ప‌డేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్స్ స్ట్రెంతెనింగ్ ప్రాజెక్ట్ అమలు, ఫలితాలపై తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్ర ఆరోగ్య రంగంలో చేపట్టిన పలు సంస్కరణలు, విధానపరమైన నిర్ణయాలను వివరించింది.

ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే సమగ్రంగా బలోపేతం చేయడం, వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు ‘జీరో వేకెన్సీ పాలసీ’ అమలు చేయడం, ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్, టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని నివేదిక పేర్కొంది.

ప్రైవేట్‌పై ఆధారపడకుండా..
ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం లభించిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగ ఒప్పందాలపై ఆధారపడటానికి బదులుగా ప్రభుత్వ రంగంలోనే వైద్య సేవల నాణ్యతను పెంచడం, ఆరోగ్య సేవలను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టిందని నివేదికలో పేర్కొంది.

ప్రాజెక్టు లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని, ముఖ్యమంత్రి స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడంతో పాటు ఉన్నత రాజకీయ నాయకత్వం ఈ ప్రాజెక్టుకు కీల‌క‌ ప్రాధాన్యత ఇచ్చిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వివరించింది. నిరంతర పర్యవేక్షణ, కాలానుగుణ సమీక్షలు ఆశించిన ఫలితాలను సాధించడంలో ప్ర‌ముఖంగా పనిచేశాయని పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోనే మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించిందని నివేదిక తెలిపింది.

రెండేళ్లలో 50 వేల నియామకాలు
దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ విధానాలకు భిన్నంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో పలు మార్పులు తీసుకొచ్చిందని నివేదిక పేర్కొంది. మెరుగైన వైద్య సేవలు, ప్రజలకు సులభంగా ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ సేవలు అందించాలనే లక్ష్యంతో ‘జీరో వేకెన్సీ పాలసీ’ అమలు చేసింది.

నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతాలు, అలవెన్సులు, ప్రోత్సాహకాలను సవరించారు. పోస్టుగ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవను అమలు చేశారు. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, ప్రమోషన్ అవకాశాలు కల్పించడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి అదనపు వేతనం అందించారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో పనిచేసేందుకు దంపతులను కూడా నియమించినట్లు నివేదిక తెలిపింది.

ఈ విధానంలో భాగంగా కేవలం రెండేళ్లలోనే దాదాపు 50 వేల మంది ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను ఏర్పాటు చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌.. ఇంటి వద్దకే వైద్య సేవలు
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను 2022 అక్టోబర్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, 2023 ఏప్రిల్‌లో అధికారికంగా అమలు చేశారు.ఈ విధానంలో ఒక వైద్యుడు మొబైల్ మెడికల్ యూనిట్‌తో కలిసి ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను నెలలో రెండుసార్లు సందర్శించేలా నిర్ణీత షెడ్యూల్ రూపొందించారు. దీంతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు వారి ఇంటి వద్దకే అందుబాటులోకి వచ్చినట్లు నివేదిక పేర్కొంది.

టెలిమెడిసిన్‌లో ఏపీ కీలక పాత్ర
ప్రత్యేక వైద్యుల సేవలను దూర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి భారీ స్థాయిలో టెలిమెడిసిన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.

ప్రాజెక్టు కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడో వంతు ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగినట్లు నివేదిక పేర్కొంది. రోజుకు 75 వేలకుపైగా టెలికన్సల్టేషన్లు, సంబంధిత ప్రిస్క్రిప్షన్లు అందించినట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ, డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేశారు. కొత్త డిజిటల్ వ్యవస్థలు, వైద్య సాంకేతికత వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల పనితీరును నిరంతరం విశ్లేషించేందుకు సెంట్రల్ డిజిటల్ క్వాలిటీ డ్యాష్‌బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

4,345 విలేజ్ హెల్త్ క్లినిక్స్.. 88 కొత్త పీహెచ్‌సీలు
ప్రాథమిక స్థాయి నుంచే ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు పునర్వ్యవస్థీకరించినట్లు నివేదిక వివరించింది. ప్రతి పీహెచ్‌సీని 12–13 విలేజ్ హెల్త్ క్లినిక్స్తో అనుసంధానం చేశారు. ఒక్కో విలేజ్ హెల్త్ క్లినిక్ సుమారు 2,500 నుంచి 4,500 మంది జనాభాకు సేవలందించేలా ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంఖ్యలో మార్పులు చేశారు.

మొత్తంగా 4,345 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్స్, 88 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. మరో 977 గ్రామీణ పీహెచ్‌సీలు, 184 అర్బన్ పీహెచ్‌సీలను పునరుద్ధరించారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల సంఖ్యను రెట్టింపు చేసి 10,086కు పెంచారు. ఈ కేంద్రాల్లో హైపర్‌టెన్షన్, డయాబెటిస్, సాధారణ క్యాన్సర్ల స్క్రీనింగ్‌తో పాటు తల్లీబిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సేవలు వంటి విస్తృత వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేశారు.

NCD-2 సర్వే.. 80 శాతం జనాభాకు స్క్రీనింగ్
2022–23లో నిర్వహించిన NCD-2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో దాదాపు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ID)ను రూపొందించారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాల జాబితా నుంచి 105 రకాల మందులు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సదుపాయాలతో మొబైల్ మెడికల్ యూనిట్లను కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అవసరమైన సందర్భాల్లో సేవలందించేందుకు ప్రతి జిల్లాలో అదనంగా నలుగురు వైద్యులను నియమించారు. ఒక్కో మొబైల్ మెడికల్ యూనిట్‌లో ఒక వైద్యుడితో పాటు డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఏర్పాటు చేశారు.

కోవిడ్ సమయంలో కీలక చర్యలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE), ఇన్ఫెక్షన్ నియంత్రణ సామగ్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేశారు.

100కు పైగా ల్యాబొరేటరీలకు కోవిడ్ పరీక్షల సామర్థ్యం కల్పించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్ యూనిట్లను కూడా వినియోగించారు. గ్రామీణ, అణగారిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి సకాలంలో చికిత్స, వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది.

వైఎస్‌ జగన్-చంద్రబాబు ప్రభుత్వాల‌కు తేడా
ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే మార్గాన్ని అనుసరించగా, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేట్ రంగంపై ఆధారపడే విధానాన్ని అనుసరిస్తోందని నివేదికలో తేడాను చూపినట్లు ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల వంటి సంస్థల నిర్వహణలో ప్రైవేట్ రంగం, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై ఆధారపడటం ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్స్ స్ట్రెంతెనింగ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలను నివేదికలో వివరించింది. ముఖ్యంగా వైద్య సిబ్బంది నియామకాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, విలేజ్ హెల్త్ క్లినిక్స్, టెలిమెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు, డిజిటల్ ఆరోగ్య సేవలు, కోవిడ్ సమయంలో చేపట్టిన చర్యలను ప్రస్తావించింది.

ఈ నివేదిక నేపథ్యంలో ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆరోగ్య రంగ సంస్కరణలు, ప్రస్తుతం అమలవుతున్న విధానాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment