ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన సైకో భార్య (Psycho Wife).. రాత్రంతా పోర్న్ వీడియోల (Porn Videos)తో కాలక్షేపం చేస్తూ కూర్చొంది. తెల్లవారేసారికి తన భర్త గుండెపోటుతో చనిపోయాడని నమ్మించి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ కిరాతక ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం చిలువూరులో లోకం శివనగరాజు (Lokam Sivanagaraju) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మొదట గుండెపోటుగా భావించిన ఈ ఘటనలో, మృతదేహంపై కనిపించిన గాయాలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలింది.
శివనగరాజుకు 2007లో లక్ష్మీ మాధురి (Lakshmi Madhuri)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబంతో కలిసి చిలువూరులో జీవనం సాగిస్తున్నారు. శివనగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, లక్ష్మీ మాధురి విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో టికెట్ కౌంటర్‌లో పనిచేసేది. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న గోపి(Gopi) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.
భర్త చేస్తున్న వ్యాపారం నచ్చక, ప్రియుడు గోపి నిర్వహిస్తున్న హైదరాబాద్ కార్ ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేందుకు శివనగరాజును పంపించింది. అయితే కొద్ది రోజుల తర్వాత శివనగరాజు తిరిగి సొంత గ్రామానికి రావడంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడని భావించిన లక్ష్మీ మాధురి అతడిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఓ రాత్రి భర్తకు బిర్యానీ వండి, అందులో సుమారు 20 నిద్రమాత్రలు (Sleeping Pills) కలిపి ఇచ్చింది. శివనగరాజు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత, ప్రియుడు గోపిని ఇంటికి పిలిచింది. గోపి ఛాతిపై కూర్చునగా, లక్ష్మీ మాధురి దిండు సహాయంతో భర్త ముఖంపై ఒత్తిడి పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
హత్య అనంతరం గోపి అక్కడి నుంచి వెళ్లిపోగా, లక్ష్మీ మాధురి రాత్రంతా ఇంట్లోనే గడిపింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్థానికులను పిలిచి, తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు హడావిడి చేసింది. అయితే మృతదేహం చెవుల నుంచి రక్తం రావడం, ముఖంపై గాయాలు ఉండటాన్ని గమనించిన శివనగరాజు స్నేహితులు, అతని తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఛాతీ ఎముకలు విరగడం వల్ల ఊపిరాడక శివనగరాజు మృతిచెందినట్లు నిర్ధారించారు. అనుమానం బలపడటంతో లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం రేపింది. అక్రమ సంబంధం కోసం భర్తను హత్య చేసిన ఈ కేసులో ప్రియుడు గోపి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.








