అణచివేస్తే పోరాటం ఆగదు.. ఇంకా ఉధృతంగా మారుతుందన్న ఉదాహరణలో చరిత్రలో కోకొల్లలుగా ఉన్నా.. మొన్నటి వరకు ఢిల్లీలో(Delhi) సాగిన జెన్ జీ ఉద్యమం (Gen Z Movement) సజీవ సాక్ష్యంగా కళ్ల ముందు కదలాడుతున్నా.. ఏపీ ప్రభుత్వం(AP Government) వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదుల చేత విమర్శలకు గురవుతోంది.
డీఎస్సీలో(DSC) జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని, విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్(Nara Lokesh) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపడుతోంది. వైసీపీ దీక్షలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(Bonda Uma) అనుచరుల దాడితో మొదలైన ఈ అలజడి జమ్మలమడుగు వరకు చేరింది.
ప్రధాని మోడీని (Prime Minister Modi) ఆదర్శంగా తీసుకోవాలని వేదికలపై చెప్పే కూటమి ప్రభుత్వం.. నిరసనలు, ఆందోళనల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ (NEET Paper leak) విషయంలో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party) పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే.. కేంద్రమే దిగివచ్చి విద్యా శాఖ మంత్రితో రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జెన్ జీ చేపట్టిన ఉద్యమం దేశాన్నే కుదిపేసింది.
జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కాక్రోచ్‌లు, జెన్ జీ, ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టినా కేంద్రం తమ పార్టీ నాయకులను పోగుచేసి దాడులు చేయించలేదు. రాళ్లు, కోడిగుడ్లు, టామాటాలు విసరాలని ఆదేశాలివ్వలేదు. కానీ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ, నిత్యం మోడీని సభా వేదికలపై పొగిడే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఏపీలో ప్రతిపక్షాల ఆందోళనను పోలీసులతో అణచివేయిస్తోంది. వారి పార్టీ నాయకులతో దాడులు చేయించడం ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.

రాష్ట్రంలో నిరసనలు తెలిపే స్వేచ్ఛ లేకుండా దాడులు, మాట్లాడే స్వాతంత్ర్యం లేకుండా కేసులు, ప్రశ్నించే అధికారం లేకుండా అరెస్టులు.. చేయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనకారులపై పోలీసుల చేత ప్రభుత్వం చేయిస్తున్న చర్య పౌర సమాజం చేత చీదరింపులకు గురయ్యేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయవాడలో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై (Malladi Vishnu) కోడిగుడ్లు(Eggs), టమాటాలతో(Tomatoes) దాడి చేసి, దీక్షా శిబిరంపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు మూత్ర విసర్జన చేయడం అత్యంత నీచమైన చర్య అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.

నేడు జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి శాంతియుత నిరసన వద్దకు వందలాది మంది పోలీసులను మోహరింపజేసి ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టింపజేసి ఆయన్ని అరెస్టు చేయడం, భర్త స్థానంలో దీక్షకు కూర్చున్న రామసుబ్బారెడ్డి భార్య ఇందిరానూ అరెస్టు చేయడం, వారిద్దరి అరెస్టు తరువాత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు దీక్షా శిబిరంలో కూర్చొని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం మానేసి, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
డీఎస్సీపై వైసీపీ, అర్హత ఉన్నా ఉద్యోగం పొందలేని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సీబీఐ ఎంక్వైరీకి రెడీ అనే స్టేట్‌మెంట్ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వినిపిస్తున్నాయి. సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా లేరంటే.. అవకతవకలు ఆరోపణలు నిజమేనన్న అపోహలు కలగక మానవు కదా.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మోడీని రోల్ మోడల్‌గా పేర్కొనే ఎన్డీయే భాగస్వామ్య కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించడం హేయమైన చర్యగా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అరెస్టులు, దాడులతో డీఎస్సీ పోరాటాన్ని ప్రభుత్వమే తారాస్థాయికి తీసుకెళ్తుందన్న అభిప్రాయం సొంత కూటమి పార్టీల నుంచే వ్యక్తం అవుతుండడం గమనార్హం.
ప్రధానమంత్రి మోడీ ఎదుగుదల, పనితీరు, క్షమాగుణం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. మోడీ ఫాలోవర్‌గా ప్రచారంలో ఉన్న పవన్.. రాష్ట్రంలో నిరసనల అణచివేతలపై నోరు మెదపరేంటన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.








