విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) దుర్ఘటణలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృత్యువుతో పోరాడుతూ, అంబులెన్స్ స్ట్రెచర్‌పై నుంచే తన కుటుంబానికి ఆఖరి సందేశం ఇచ్చి యావత్ తెలుగు లోకాన్ని కంటతడి పెట్టించిన కార్మికుడు పైడిరాజు (Paidiraju) ఇక లేరు. విశాఖలోని సెవెన్ హిల్స్ (Seven Hills Hospital) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. పైడిరాజు మరణంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది.
సోషల్ మీడియాను కదిలించిన ‘ఆఖరి’ వీడియో
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన మెల్టెన్ స్టీల్ లీకేజీ (Molten Steel Leakage) ప్రమాదంలో గంగవరం గ్రామానికి చెందిన పైడిరాజు 90 శాతానికి పైగా తీవ్ర గాయాలతో నరకం చూశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను మొదట స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.
అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో.. ఒళ్లంతా కాలిపోయి నరకయాతన అనుభవిస్తూనే, తాను బతకననే అనుమానంతో పైడిరాజు ఎలాగైనా తన పిల్లలతో మాట్లాడాలని, అంబులెన్స్ సిబ్బందిని ఒక వీడియో రికార్డ్ చేయమని బతిమాలారు. ఆ సమయంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (Emergency Medical Technician) రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి, లక్షలాది మంది చేత కన్నీరు పెట్టించింది.
“అమ్మను బాగా చూసుకోండి.. ఉంటాను డాడీ!”
ఆ వీడియోలో పైడిరాజు మాట్లాడిన చివరి మాటలు ప్రతి ఒక్కరి గుండెలను పిండేశాయి. ఒంటిపై ఉన్న గాయాలను కూడా లెక్కచేయకుండా కేవలం తన కుటుంబ బాధ్యతల గురించే ఆలోచిస్తూ.. “వర్మ(Varma).. తమ్ముడిని (Brother)బాగా చదివించమ్మా. నువ్వు కూడా బాగా చదువుకో.. ఎలాంటి గొడవలు పడకండి. అమ్మను(Mother) చాలా జాగ్రత్తగా చూసుకోండి.. ఉంటాను డాడీ” అంటూ పెద్ద కొడుకును పిలుస్తూ ఆయన చెప్పిన ఆఖరి మాటలు ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేశాయి.
90 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. స్టీల్ మెల్టింగ్ షాప్-1 (Steel Melting Shop-1) (SMS-1) లో సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ద్రవరూప ఉక్కు (Molten Steel) లాడిల్ ఒక్కసారిగా కిందపడటంతో ఈ భారీ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద స్థలంలోనే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన పైడిరాజు ఆసుపత్రిలో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రస్తుతం మరికొందరు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.








