అమెరికా-ఇరాన్ (America-Iran) మధ్య ఉద్రిక్తత మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) వాణిజ్య నౌకలపై (Commercial Ships) ఇరాన్ దాడులు జరిపిందని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరికల అనంతరం అమెరికా సైన్యం ఇరాన్‌పై మరో విడత వైమానిక దాడులు చేపట్టింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని తెలిపింది.
తాజా దాడుల్లో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ (Bandar Abbas), సిరిక్, చాబహార్, కొనరాక్, బుషెహర్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చాబహార్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, షాహిద్ బెహెష్టి పోర్ట్, కలంతరి పోర్ట్, సముద్ర ట్రాఫిక్ నియంత్రణ టవర్‌తో పాటు పలు కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వెల్లడించాయి. స్థానిక కథనాల ప్రకారం ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఈ నష్టాలపై స్వతంత్ర ధృవీకరణ పరిమితంగానే ఉంది.
దాడులకు ముందు ట్రంప్ ఇరాన్‌కు(Iran) గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు కఠిన ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేశారు. టర్కీలో జరిగిన నాటో సమావేశం సందర్భంగా కూడా అమెరికా(America) సముద్ర మార్గాల భద్రతకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య భద్రతతో పాటు ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.








