సింగరేణికి సంపూర్ణ ప్రక్షాళన అవసరం : కేంద్ర మంత్రి

సింగరేణికి సంపూర్ణ ప్రక్షాళన అవసరం : కేంద్ర మంత్రి

Summarize with AI

సింగరేణి కాలరీస్ సంస్థ(Singareni Collieries Company Limited)లో సంపూర్ణ ప్రక్షాళన జరగాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సింగరేణి వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణిలో జరిగిన అన్ని లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఒడిశా (Odisha State)లోని నైనీ కోల్ బ్లాక్‌ (Naini Coal Block)ను సింగరేణికి అప్పగించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఆ కోల్ బ్లాక్ మైనింగ్ విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని, టెండర్లను ఆహ్వానించి మళ్లీ రద్దు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

నైనీ కోల్ బ్లాక్ విషయంలో గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని మండిపడ్డారు. టెండర్ల ప్రక్రియలో ఎక్కడా లేని విధంగా “సైట్ విజిట్” అనే కొత్త నిబంధనను తీసుకువచ్చారని, ఇది రాష్ట్ర పెద్దల ఆదేశాలతోనే జరిగిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ విధానం అమలులో ఉంటే, తెలంగాణలో మాత్రం ప్రత్యేక నిబంధనలు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.

తాను వ్యక్తిగతంగా ప్రయత్నించి సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించానని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయినా మైనింగ్ ప్రారంభంలో జాప్యం చేయడం వెనుక మంత్రుల మధ్య వాటాల తేడాలే కారణమని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియ బోర్డు ముందుకు కూడా రాకుండా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ.32 వేల కోట్ల బకాయి పడిందని, ఇదే సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు ధర, నాణ్యత పడిపోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. తమకు నచ్చిన ఎమ్మెల్యేలకు సింగరేణి భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే సీబీఐ దర్యాప్తును పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు డిసెంట్ నోట్‌లు పెట్టడం తప్ప మరేం చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి సింగరేణి వ్యవహారాల్లో జరిగిన అక్రమాలు, అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, సంస్థను రాజకీయ జోక్యాల నుంచి విముక్తం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment