తిరుపతిలోని అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్తులను టూరిజం పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. ఈ భూములను టూరిజం శాఖకు అప్పగించి, అక్కడ ప్రైవేట్ హోటళ్లు (Private Hotels), స్పా సెంటర్లు (Spa Centers) ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు (Hindutva Organizations) ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు.
శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తులను వ్యాపార లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం హిందువులకు, స్వామివారికి ద్రోహం చేయడమేనని భూమన కరుణాకర్ మండిపడ్డారు. గతంలో టిటిడి భూములను ఎస్వీయూ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి వంటి ప్రజాప్రయోజన సంస్థలకు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సామాన్య భక్తులకు ఎలాంటి ఉపయోగం లేని విధంగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.
ఎర్రచందనం వ్యవహారంపై అనుమానం
ఇక ఎర్రచందనం చెట్ల (Red Sandalwood Trees) వ్యవహారం మరింత అనుమానాలకు దారి తీస్తోందని భూమన ఆరోపించారు. ఉన్న చెట్లను తొలగించి, కొత్తగా నంబర్ ప్లేట్లు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు ఉండటం, పాత నంబర్లతో పాటు కొత్త నంబర్లు వేయడం వెనుక కుట్ర ఉందని అన్నారు. ఎర్రచందనం లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. పాత నంబర్ 1623 ఉండగా, కొత్తగా 613 నంబర్ వేయడం మధ్యలో ఉన్న చెట్లు ఏమయ్యాయనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.460 కోట్లు కాగా, మార్కెట్ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని భూమన కరుణాకర్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) వెంటనే స్వామివారి ఆస్తుల బదలాయింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎర్రచందనం దుంగలను కాపాడతామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. టిటిడి పవిత్ర స్థలాలను 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం ప్రమాదకర సంకేతమని, భవిష్యత్తులో సింహాచలం, కనకదుర్గ వంటి ఇతర దేవాలయాల ఆస్తులకూ ఇదే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. దేవుడి ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని భూమన కరుణాకర్ పిలుపునిచ్చారు.








