కాలేజీ యువతను పట్టి పీడించే ర్యాగింగ్(Ragging) భూతం.. కార్పొరేట్ స్కూళ్లకు (Corporate Schools) కూడా పాకింది. క్వాలిటీ విద్య(Quality Education) పేరుతో లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులను పీడించి మరీ వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థల్లో(Corporate Educational Institutions) పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా ఘటన శ్రీచైతన్య స్కూల్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్(Hyderabad) శివారు మేడ్చల్–మల్కాజిగిరి (Medchal–Malkajgiri) జిల్లాలోని దమ్మాయిగూడ శ్రీచైతన్య హైస్కూల్‌లో (Sri Chaitanya High School) పదో తరగతి (10th Class) విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్ పేరుతో 12 మంది విద్యార్థులు తమ కుమారుడిపై కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కారని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన అభిషేక్ దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉంటున్న అభిషేక్‌పై రాత్రి సమయంలో సుమారు 12 మంది తోటి విద్యార్థులు దాడి చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కర్రలు, ప్లేట్లతో అభిషేక్‌ను తీవ్రంగా కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా హింసించినట్లు ఆరోపించారు. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తమ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం గురించి స్కూల్ యాజమాన్యం (School Management) తమకు ఫోన్ చేసి, అభిషేక్ మెట్లపై నుంచి కిందపడిపోయాడని చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే పాఠశాలకు చేరుకుని తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిపై దాడి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఘటనను తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








