తెలంగాణలో రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ అంతర్గత రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతో పొత్తు విషయమై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్నప్పటికీ, తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, సహ ఇన్చార్జులు రేఖా శర్మ, అభయ్ పాటిల్‌లు నిర్వహించిన కీలక అంతర్గత సమావేశంలో పొత్తు ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది.
తెలంగాణ వ్యతిరేక ముద్ర పడే ప్రమాదం
తెలంగాణ ప్రజలు జనసేనను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేసే ప్రాంతీయ పార్టీగా, ‘తెలంగాణ వ్యతిరేక భావజాలం’ ఉన్న పార్టీగా చూస్తున్నారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై కూడా ‘తెలంగాణ వ్యతిరేకి’ అనే ముద్ర వేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
హిందూత్వ భావజాలానికి జాతీయ స్థాయిలో బీజేపీయే అసలైన బ్రాండ్ అని నేతలు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఎంత హిందూత్వం గురించి మాట్లాడినా అది తెలంగాణ ఓటర్లను, ముఖ్యంగా పట్టభద్రులను పెద్దగా ప్రభావితం చేయదని తేల్చిచెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ లభించిన ఓట్ల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్నందున జనసేనకు గౌరవం ఇద్దామని, అయితే ప్రత్యక్ష పొత్తు లేకుండా పరోక్ష మద్దతు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని కొంతమంది సీనియర్ నేతలు సూచించారు. అలా కాకుండా పూర్తిస్థాయి పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుకే తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు.
హైకమాండ్ కోర్టులోకి బంతి
చివరకు పొత్తుపై తుది నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానానికే వదిలేయాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి (గడల శ్రీనివాసరావు)కి బీజేపీ మద్దతు ఇవ్వాలని, దానికి ప్రతిఫలంగా మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో బీజేపీ పోటీ చేసి, జనసేన మద్దతు తీసుకోవాలని కొందరు నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాల మధ్య బీజేపీ జాతీయ నాయకత్వం జనసేన పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.








