ఏపీని వణికిస్తున్న ‘అర్నాబ్’ తుఫాను

ఏపీని వణికిస్తున్న ‘అర్నాబ్’ తుఫాను

Summarize with AI

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. దీనికి ‘అర్నాబ్’ (Arnab)గా నామ‌క‌ర‌ణం చేశారు.

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాగల 24 గంటల్లో ఈ తుఫాను మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా (Very Severe Cyclonic Storm) మారనుంది. బుధవారం (అక్టోబర్ 28) ఉదయం నాటికి ఇది కాకినాడ, యానాం సమీపంలో లేదా బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

‘అర్నాబ్’ తుఫాను ప్రస్తుతంవిశాఖపట్నం నగరానికి ఆగ్నేయంగా 650 కి.మీ. దూరంలో, కాకినాడకు 730 కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి 830 కి.మీ. దూరంలో, బాపట్లకు 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ప్రచండ గాలులు.. కుండపోత వర్షాలు!
‘అర్నాబ్’ తుఫాను ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా, రేపటికి అతి తీవ్ర తుఫానుగా రూపంతరం చెందనుంది. బుధవారం తీరం దాటే సమయంలో తీరప్రాంత జిల్లాల్లో గంటకు 100 నుండి 130 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు వాతావరణ శాఖ రైడ్ అలెర్ట్ (Red Alert) జారీ చేసింది.

రాగల 48 గంటల పాటు (రేపు, ఎల్లుండి) ఉత్తర, మధ్య కోస్తాంధ్రలోని స్థానిక యంత్రాంగాన్ని విపత్తు నిర్వహణ సంస్థ అత్యంత అప్రమత్తం చేసింది.

“రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత కీలకం. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. తుఫాను సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడకూడదు” అని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

తుఫాను ధాటికి రాకపోకలు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటంతో పునరావాస చర్యలు చేపడుతున్నట్లు, కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment