చైనా, జపాన్‌లతో పోటీపడటమే తెలంగాణ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

చైనా, జపాన్‌లతో పోటీపడటమే తెలంగాణ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Summarize with AI

సమాఖ్యల అవసరం ప్రస్తుత కాలంలో ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహించిన SAMAKHYA బిజినెస్‌ సమ్మిట్‌-2026ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా కొత్త తరం వాణిజ్య చట్టాలు, వ్యాపార విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. యువత ఎలోన్‌ మస్క్‌ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పోటీపడే స్థాయికి ఎదుగుతోందని, విజయగాథలు, వారసత్వ విలువలను భావితరాలకు అందించడం అవసరమని పేర్కొన్నారు. 2047 నాటికి దేశం సాధించాల్సిన లక్ష్యాలపై సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత తమ పూర్తి దృష్టి అభివృద్ధిపైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హిల్ట్‌ పాలసీ ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) వల్ల అనేక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. వ్యక్తిగతంగా ఎదగడం కంటే సమష్టి అభివృద్ధి, సమాఖ్యల బలోపేతం సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు. అమరావతి లేదా ఇతర రాష్ట్రాలతో కాకుండా చైనా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలను కేవలం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులుగా చూడకుండా, బస్సుల యజమానులుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్‌ బంకులు, విద్యుత్‌ ప్లాంట్ల రంగాల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment