బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. ఆ పత్రిక పేరు మార్చుకుని ‘చంద్రబాబు పత్రిక’ అని పెట్టుకుంటే సరిపోతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై నోరుమెదపని పత్రిక, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకే తప్పుడు కథనాలు రాస్తోందని ధ్వజమెత్తారు.
బీసీలను కేవలం ‘బ్యాక్‌వర్డ్ క్లాసులు’గా కాకుండా సమాజానికి ‘బ్యాక్‌బోన్ క్లాసులు’గా గుర్తించి, వారికి అత్యున్నత ప్రాధాన్యత కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైసీపీ హయాంలో 25 ఎంపీ స్థానాల్లో 11 స్థానాలను, రాజ్యసభలోని 13 స్థానాల్లో నలుగురు బీసీలకు కేటాయించి సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు.
మొత్తం 58 ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకంగా 28 మంది బీసీలకు అవకాశం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. అలాగే 13 జెడ్పీ చైర్మన్ స్థానాల్లో ఆరుగురు బీసీలకు, 13 మేయర్ స్థానాల్లో తొమ్మిది మంది బీసీలకు అవకాశాలు కల్పించడంతో పాటు జనరల్ కేటగిరీ స్థానాల్లోనూ బీసీలను గెలిపించుకున్న చరిత్ర వైసీపీది అన్నారు. 139 బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏకంగా 56 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్క బీసీకి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. తాము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం, నేడు బీసీ రిజర్వేషన్లకు ఎందుకు చట్టపరమైన రక్షణ కల్పించలేకపోతోందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా బీసీలకు ఇచ్చిన పెన్షన్ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
బీసీ నేతలు, మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజిని తదితరులపై పెడుతున్న అక్రమ కేసులను, అలాగే బీసీ ఎమ్మెల్యే విరూపాక్షిపై కక్షసాధింపు చర్య భాగంగా బనాయించిన కేసులను ‘ఈనాడు’ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం ఆ పత్రికకు ఉందా అని సవాల్ విసిరారు.








