ఎన్డీయేలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, ‘ఇండి’ కూటమికి చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో సమావేశం కానుండడం, టీడీపీ నేతలు భారీ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకొని, విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు నేడు సాయంత్రం సీఎం విజయ్ ఏపీకి రానున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌తో చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం కానుండడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్‌పై వ్యూహాత్మకంగా క్రిస్టియన్ అని దుష్ప్రచారం చేసిన వర్గాలే, నేడు ఆయన రాకను ఘనంగా స్వాగతిస్తూ ప్రచారం చేసుకోవడం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు అధికారికంగా కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కొనసాగుతూనే, మరోవైపు ‘ఇండి’ కూటమి ముఖ్యమంత్రులతో సీఎం చంద్రబాబు సాన్నిహిత్యంగా మెలుగుతుండడం, వారితో కలిసి వేదికలు పంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా, అలాగే ప్రాంతీయ పార్టీల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో… చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే, మరోవైపు ‘ఇండి’ కూటమిలోని కీలక భాగస్వాములతో తెరవెనుక సంబంధాలు నెరపుతూ, వేదికలు పంచుకోవడం భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ముందస్తు వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2018 అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రంలో ఎప్పుడైనా విభేదాలు తలెత్తితే ప్రత్యామ్నాయ పొత్తుల కోసం ఇప్పుడే పునాదులు వేసుకుంటున్నారనే వాదనలు బలపడుతున్నాయి. ఏదేమైనా, ఈ భేటీ కేవలం ఇరు రాష్ట్రాల జల సంబంధాలు, అధికారిక పర్యటన మాత్రమే కాదనే చర్చ జరుగుతోంది.









