తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ఆరాధ్యదైవంగా పూజించే వంగవీటి మోహన రంగా వారసుడిగా అడుగుపెట్టిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తన తండ్రి ఆశయాలను, పేరు ప్రఖ్యాతులను నిలబెడుతూ రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాల్సిన వ్యక్తి.. అనూహ్యంగా మున్సిపల్ మేయర్ పదవి కోసం పాకులాడటం పట్ల వంగవీటి రంగా అభిమానులు, కాపు సంఘాల పెద్దలు, బెజవాడ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలతో రాధా తన రాజకీయ భవిష్యత్తును తానే చేజేతులా పాడుచేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న వంగవీటి రాధా, ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోవడానికి ఆయన తీసుకున్న తప్పటడుగులే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ఎమ్మెల్యేగా గెలిచి, భవిష్యత్తులో మంత్రి స్థాయికి ఎదగాల్సిన కీలక తరుణంలో ప్రజారాజ్యం పార్టీలోకి (PRP) వెళ్లడం ఆయన రాజకీయ పయనానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది.
2019 ఎన్నికల ముందు వైసీపీ అధికారంలోకి వస్తుందనే అంచనాతో, ఎలాంటి స్పష్టత లేకుండా ఆ పార్టీని వీడి టీడీపీ గూటికి చేరడం ఆయన కెరీర్ను మరింత వెనక్కి నెట్టింది. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ, పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి.
శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక సీనియర్ నేత, ఇప్పుడు ఏకంగా విజయవాడ మేయర్ పదవి కోసం తాపత్రయ పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, బెజవాడ రాజకీయాలను శాసించాల్సిన స్థాయి నుంచి దిగివచ్చి.. మేయర్ పదవి కోసం అర్రులు చాచడం వంగవీటి స్థాయిని దిగజార్చడమేనని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
ఇదంతా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గేమ్లో భాగమని కాపు సామాజిక వర్గ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాధాకు ఎలాంటి పదవి ఇవ్వకుండా కేవలం బెజవాడలో టీడీపీ ఉనికిని కాపాడుకోవడం కోసమే వాడుకున్నారనే విమర్శలు గతం నుంచి ఉన్నవే.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా, ఎమ్మెల్యే, రాజ్యసభ వంటి పదవులు రాధాకు దక్కలేదు.
అనుచరులు, అభిమానులు చెబుతున్న మాటలు వినకుండా, కేవలం తాత్కాలిక పదవుల కోసం పార్టీలు మారుతూ తన ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును రాధా చేజేతులా పోగొట్టుకుంటున్నారని కాపు సామాజికవర్గ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రియాలిటీ పాలిటిక్స్ ఏంటో గ్రహించి, తన తండ్రి ఆశయాలకు తగినట్లుగా గౌరవప్రదమైన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు.








