కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంతాప సభ (Condolence Meeting) వేదికగా టీడీపీ(TDP) నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు (Uma Maheswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో (Kapu Community) అలజడి మొదలైందని, వారి ఆక్రందనలను ప్రభుత్వం (Government) పట్టించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు తప్పనిసరని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి ముద్రగడ (Mudragada) చేపట్టిన ఉద్యమం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గుంటూరులో కాపు జేఏసీ (JAC) ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో బోండా ఉమ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ ఉద్యమ ప్రస్థానంతో పాటు కాపుల ప్రస్తుత పరిస్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ముద్రగడ ప్రభావంతోనే 2019లో టీడీపీకి నష్టం
ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమ ప్రభావం 2019 ఎన్నికల్లో టీడీపీపై (TDP) పడిందని బోండా ఉమ వ్యాఖ్యానించారు. అప్పట్లో ముద్రగడ రాసిన లేఖలను తగినంత సీరియస్‌గా తీసుకోలేదని గుర్తుచేశారు. ముద్రగడకు కాపుల్లో పెద్దగా పట్టు లేదని కొందరు చెప్పడంతో ఆయన లేఖలను పట్టించుకోలేదని.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో అలజడి మొదలైందని తెలిపారు. ఆ పరిణామాల ప్రభావం ఎన్నికల్లో కనిపించిందని, 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ముద్రగడ ఉద్యమం కూడా ప్రధాన కారణమైందని పేర్కొన్నారు.
ప్రస్తుతం మరోసారి కాపు సామాజికవర్గంలో అలజడి మొదలైందని బోండా ఉమ అన్నారు. వారి సమస్యలు, ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని సూచించారు. కాపుల నుంచి వస్తున్న డిమాండ్లను (Demands) పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కాపులకు రావాల్సిన నిధులు, రాజకీయ పదవులు ఇంకా దక్కాల్సి ఉందని బోండా ఉమ వ్యాఖ్యానించారు. ఈ అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల అండ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
అధికార టీడీపీకి(TDP) చెందిన కీలక నేత నుంచే కాపుల్లో అసంతృప్తి, అలజడి ఉందనే వ్యాఖ్యలు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల అనుభవాన్ని కూడా ఆయన గుర్తుచేయడంతో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.
రాజకీయ వ్యాఖ్యలతో పాటు సంతాప సభలో మరో ఆసక్తికర పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. బోండా ఉమ, వైసీపీ (YSRCP) నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎదురుపడగానే ఇద్దరూ ఆలింగనం (Hug) చేసుకుని పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత పక్కపక్కనే కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. పలకరింపుల నుంచి ముద్రగడకు నివాళులర్పించే వరకు ఇద్దరు నేతలు పక్కపక్కనే కనిపించారు.








