టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

Summarize with AI

అనంతపురం జిల్లాలో రాజకీయ వర్గాల్లో సంచలనం ఘటన చోటు చేసుకుంది. శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద క్షుద్రపూజలకు సంబంధించిన అనుమానాస్పద ఘటన కలకలం సృష్టించింది. అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరివేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎవరూ గుర్తించకుండా రాత్రి సమయంలో కారులో వచ్చిన దుండగులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు చల్లి అక్కడి నుంచి వేగంగా కారులో పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన శ్రావణి అనుచరులు వెంటనే అప్రమత్తమై, కారులో పారిపోతున్న నిందితులను వెంబడించారు. అయితే అప్పటికే దుండగులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. కార్ నంబర్ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, ఆ వాహనం గుంటూరు ప్రాంతానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. అయితే, వాహన యజమానిని సంప్రదించగా, ఆ కారును గతంలోనే అమ్మేశామని ఆయన పోలీసులకు తెలిపారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నివాసం వద్ద ఇలాంటి క్షుద్రపూజల ప్రయత్నం వెనుక ఎవరు ఉన్నారు? రాజకీయ కక్షలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment