సాయికృష్ణ లాకప్ డెత్.. ఆ ముగ్గురి కోసం వేట

సాయికృష్ణ లాకప్ డెత్.. ఆ ముగ్గురి కోసం వేట

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ‘సిట్’ (SIT) త‌వ్వేకొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి సాయికృష్ణను చంపేసిన ఉదంతంలో అరెస్టయిన మాజీ సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టుతో పాటు, తాజాగా సిట్ సేకరించిన మరికొన్ని కీలక అంశాలు సంచ‌ల‌నంగా మారాయి. మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు గుర్తించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వెంటనే.. స్టేషన్‌లో ఆయనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిందితుడు సీఐ నాగరాజుకు అసిస్టెంట్‌గా వ్యవహరించిన అశోక్.. ఈ దారుణంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

మరో హెడ్ కానిస్టేబుల్ నాని.. గతంలో గన్నవరం, పటమట పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సమయంలోనూ అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ వ్యవహారాలు, సెటిల్మెంట్లు నడపడంలో నాని సిద్ధహస్తుడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన అభియోగాల నేపథ్యంలోనే గతంలో ఇతడిని వీఆర్ కు కూడా పంపారు. అయితే, ఇటీవల కాలంలోనే ఇతడు మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తెచ్చుకోవడం, ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాన్ని వేరే చోటుకు తరలించి, దహనం చేయడంలో సీఐకి అత్యంత సన్నిహితుడైన సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తి కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.

గత నెల 29వ తేదీన సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను సెటిల్‌మెంట్ పేరిట సురేష్ పిలిచాడు. ఆ తర్వాత తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో ఉన్న నవరంగ్ ఇంటికి ఒక బ్లాక్ కలర్ వెహికల్‌లో హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలతో కలిసి సురేష్ స్వయంగా వెళ్లాడు. ఇదే విషయాన్ని సాయికృష్ణ మేనమామ నవరంగ్ సిట్ అధికారుల ముందు వాంగ్మూలంగా ఇచ్చారు.

పరారీలో ఉన్న ముగ్గురి కోసం ‘సిట్’ గాలింపు
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మే 6 నుండి మే 8 మధ్య చట్టవిరుద్ధంగా నిర్బంధించి, తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడని, అనంతరం సీఐ నాగరాజుతో కలిసి హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, ప్రైవేట్ వ్యక్తి సురేష్‌లు పక్కా ప్లాన్ ప్రకారం మృతదేహాన్ని తగలబెట్టి మాయం చేశారని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుంటే సాయికృష్ణ శవాన్ని ఎక్కడ తగలబెట్టారు? డిజిటల్ ఆధారాలను ఎలా ధ్వంసం చేశారు? అనే విషయాలపై మరిన్ని నమ్మసక్యమైన నిజాలు బయటకు రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment